నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను? – నా గమనం ఎటు వైపు?
- "నా వైఫల్యాల(ఫెయిల్యూర్స్) నుండి నేర్చుకున్న జీవిత పాఠాలు.
- చేసిన తప్పిదాలను అంగీకరించిడం.
- స్వీయ అభ్యాసం(సెల్ఫ్ లెర్నింగ్), ఏకాగ్రతతో ముందుకు సాగడం.
- ఇదే విజయానికి నిజమైన మార్గం."
మొదట్లో నేను – “నాకు ఇది సరైన సమయం కాకపోవడం చేత ఫెయిల్ అయ్యుండొచ్చు.నాకు ఇంకా మంచి సమయం రాకపోవడం వల్లే నేను ముందుకు సాగలేకపోతున్నాను.”అని అనుకున్నాను.కానీ కాలక్రమంలో నాకు తెలిసింది – అసలు సమస్య సమయంలో కాదు, సమస్య నాలోనే ఉందని. నా లోపల ఉన్న కొన్ని అలవాట్లు, ఆలోచనలు, భయాలే నా విజయానికి అడ్డుపడుతున్నాయని అర్థమైంది.
ఈ వ్యాసంలో, నా వైఫల్యాలకు కారణమైన ప్రధాన అంశాలను మీతో పంచుకుంటున్నాను. ఇవి నా స్వీయ(self) అనుభవాల ద్వారా నేర్చుకున్న పాఠాలు. మీరు కూడా ఇలాంటివి అనుభవిస్తే, ఇవి మీ ప్రయాణంలో కొంత వెలుగుని చూపుతాయని నమ్ముతున్నాను.
1. సరైన లక్ష్యం లేకపోవడం – గమ్యం లేని ప్రయాణం
నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉండేది – “ఏదో గొప్పదాన్ని సాధించాలి.” కానీ ఆ గొప్పదాని యొక్క రూపం నాకు స్పష్టంగా తెలియదు. “ఏం సాధించాలి?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం వల్ల నా ప్రయాణం ఒక గమ్యం లేని నడకలా మారిపోయింది.
మనం వెళ్ళే గమ్యం ఏమిటో తెలియకపోతే, ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. ఇది నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఇప్పుడు నాకు తెలిసింది – మనకు స్పష్టమైన లక్ష్యం ఉంటేనే మన దృష్టి నిలుస్తుంది, మన పూర్తి శక్తి ప్రయత్నించే పని వైపు పెట్టగలం అని.
2. పనిని వాయిదా వేయడం – నాలో దాగిన శత్రువు
“ఇది రేపు చేద్దాం… ఇంకోసారి ఎపుడైనా ప్రారంభిద్దాం…” అని నేను నన్నే మోసం చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చిన్న పనైనా వాయిదా వేసుకోవడం చివరకు ఒక పెద్ద అలవాటుగా మారిపోయింది.
పని వాయిదా వేస్తే, మనం ఒక రోజులో చేసే చిన్న అశ్రద్ధ, మన విజయంలో పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది.నేను ఎన్నో పనులను వాయిదా వేయబట్టే కష్టం వచ్చినప్పుడు ఆర్థికంగా ఎదుర్కోలేక పోతున్నాను. ఇప్పుడు నేర్చుకున్న పాఠం – చిన్న పని అయినా వెంటనే మొదలుపెట్టు. ఎందుకంటే ఒక చిన్న అడుగు కూడా మనల్ని మన గమ్యానికి ఒక్క అడుగు దగ్గర చేస్తుంది.
3. ఇతరుల అభిప్రాయాల భయం – నన్ను బంధించిన సంకెళ్లు
నేను ఏ పని మొదలుపెట్టినా, వెంటనే ఒక భయం వచ్చేది – “వాళ్లు ఏమంటారు?”, “వాళ్లు నన్ను ఎలా చూస్తారు?”. ఈ ఆలోచనల వల్ల నా ఆత్మవిశ్వాసం బలహీనమైంది.
చివరకు నేను గ్రహించాను – మనం మనల్ని మనమే నమ్మకపోతే, ప్రపంచం మనల్ని ఎప్పటికీ నమ్మదు. ఇతరుల అభిప్రాయాలు మారిపోతాయి, కానీ మన అభిప్రాయం మన జీవితాన్ని మార్చగలదు.
4. ఏకాగ్రత లోపం – టాలెంట్ వృథా చేసిన తప్పు
నా చేతిలో ఉన్న పనిపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోయాను. ఫోన్ లో నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, ఇతరుల సంభాషణలు – ఇవన్నీ నన్ను అడ్డుకున్నాయి. ఫలితం ఏమిటి? నేను ప్రారంభించిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
ఇప్పుడు నాకు తెలిసింది – ఏకాగ్రత లేకపోతే టాలెంట్‌కి విలువ ఉండదు. అందుకే నేను రోజూ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మనసుని నియంత్రించడం నేర్చుకుంటే, విజయం మనదే అవుతుంది.
5. నిత్యాభ్యాసం లేకపోవడం – స్థిరత లేని ప్రయత్నం
ఏ పని అయినా సాధన లేకపోతే ఆ పనిని విజయవంతం చేయలేం. నేను మాత్రం “ప్రారంభిస్తే చాలు” అనుకున్నాను. క్రమం తప్పకుండా అభ్యాసం చేయకపోవడం వల్లే నా కృషి ఫలితం ఇవ్వలేదు.
ఇప్పుడు నాకు తెలుసు – అభ్యాసమే ఆత్మవిశ్వాసానికి మూలం. ప్రతిరోజూ చేసే చిన్న క్రమబద్ధమైన కృషి, ఒకరోజు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
6. నా కలల నుండి దూరం కావడం – మర్చిపోయిన కలల దారులు
కొన్నిసార్లు నా కలలే ఎక్కడో మాయమైపోయినట్లు అనిపించింది. జీవన ఒత్తిళ్లు, ఇతరుల మాటలు, విఫలతల(ఫెయిల్యూర్స్) భయం – ఇవన్నీ నా కలలను పక్కకు నెట్టేశాయి. కానీ నా హృదయం మాత్రం నాకెప్పుడూ గుర్తు చేస్తుంది – “నువ్వు ఇంకా ఆగిపోలేదు, మళ్లీ మొదలు పెట్టగలవు.”
చివరి మాట
ఈ లోపాలను గుర్తించిన తర్వాతే నేను నా జీవితంలో చిన్న చిన్న మార్పులు మొదలు పెట్టాను. ఇప్పుడు నేను నా బలహీనతలను దాచడం లేదు – వాటిని అంగీకరిస్తూ, వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను.
మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉంటే, ఒకసారి మీలో చూసుకోండి. మన సమస్యలు బయట కాదు, మనలోనే ఉంటాయి. అదే సమయంలో – పరిష్కారాలు కూడా మనలోనే ఉంటాయి.
విఫలం(ఫెయిల్ )అవడం అంటే ముగింపు కాదు. అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి